సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాటి వద్ద బాహ్యవలయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాంలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు పొట్టకూటి కోసం బెంగుళూరుకు వెళ్లారు. స్వస్థలాలకు వెళ్లేందుకు 10 మంది కారులో బయల్దేరారు. పాటి వద్ద అతివేగంతో వెళ్తున్న వీరి వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టడం వల్ల వాహనం నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల శరీర భాగాలు రోడ్డుపైన చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.
మృతదేహల గుర్తింపులో ఆలస్యం
సమాచారమందుకున్న జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇంఛార్జి డీఎస్సీ శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులు రాంఘడ్‌కు చెందిన కమలేష్ లోహరే, హరి లోహరే, వినోద్ భుహెర్, గోరఖ్‌పూర్ చెందిన పవన్‌కుమార్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమన్న ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.. మృతులను పూర్తి స్థాయిలో గుర్తించి బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. బాహ్యవలయ రహదారిపైన ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించటంతో పాటు మృతదేహాలను పటాన్చెరువు శవగారానికి తరలించారు. క్షతగాత్రలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు