ఏపీలోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-గుంటూరు హైవేపై గొర్రెల లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ట్రాక్టర్ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే మృతిచెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వాహనంలో ఉన్న 40 గొర్రెలు చనిపోయాయి. మృతులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.
ఆటో, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు...
అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న ఓ వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.
బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి..
విశాఖ జిల్లా కె.కోటపాడు బత్తినవానిపాలెం వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు చనిపోయాడు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జె.పి.అగ్రహారం గ్రామానికి చెందిన చిటికెల సత్తిబాబు... కె.సంతాపాలెం గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి వెళ్తుండగా బత్తినవానిపాలెం మలుపులో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే సత్తిబాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు మృతి