సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డితోపాటు మేనమామ యుగేందర్ రెడ్డిని పోలీసులు ఆరు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారించారు. వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. హత్యకు గల కారణాలను నిందితులు వివరించారు. అవంతి ప్రేమ విషయం తెలిసిన రోజు నుంచి ఆమెను చాలా కట్టడి చేశామని... తమ నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుందని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు వెల్లడించారు.
వివాహం చేసుకున్న తర్వాత తమకు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని... అప్పుడు చందానగర్ పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తన బావమరిది యుగంధర్ రెడ్డితో మాటలు లేవని... హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి పోలీసులకు తెలిపాడు. తమది ప్రాణం కంటే పరువే ప్రధానమని భావించే కుటుంబమని... అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తర్వాత మరి కొందరిని కూడా విచారించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్య!