హైదరాబాద్ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ ముత్తు పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఆయన పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు కూడా పంపారు. ఆయన స్నేహితులు కొంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించారు. దీంతో సైబర్ నేరగాళ్లు వెంటనే ఐదు వేలు పంపాల్సిందిగా ఓ వ్యక్తిని కోరారు. వెంటనే అనుమానం వచ్చిన అతను సీఐ ముత్తు దృష్టికి తీసుకెళ్లాడు.
నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచారని వెంటనే గుర్తించిన ముత్తు.. తన అసలైన ఫేస్‌బుక్‌తోపాటు ట్వీట్టర్, వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. తన పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఎవరూ.. అంగీకరించవద్దని.. పొరపాటున ఎవరైనా అంగీకరించినా... వెంటనే తొలగించాలని ముత్తు కోరారు. ఫేస్బుక్ ద్వారా తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా ఇవ్వొద్దని.. తన దృష్టికి తీసుకురావాలని ట్రాఫిక్ సీఐ ముత్తు కోరారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారుల ఫేస్బుక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాళ్ల పేరుతో ఖాతాలు తెరిచి స్నేహితులకు, బంధువులకు డబ్బులు పంపాల్సిందిగా సందేశాలు పంపిస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి : ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి