పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముత్తుల నర్సయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. సింగరేణి ఉద్యోగం కోసం ఆయన కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.
గ్రామానికి చెందిన నర్సయ్య సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. నర్సయ్యకు భార్య తారతో పాటు తిరుపతి, రాకేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు తిరుపతి పాలిటెక్నిక్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో తిరుపతి తన తండ్రిని హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లి తారతో పాటు తమ్ముడు రాకేశ్‌కు చెప్పాడు. అందుకు వారూ అంగీకరించడం వల్ల గత నెల 27న నర్సయ్య నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం తన తండ్రి గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. కుటుంబ సభ్యుల సహకారంతో తిరుపతి పథకం ప్రకారమే తండ్రి నర్సయ్యను హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడు తిరుపతి, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.