ఆన్లైన్ లోప్ యాప్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యవసరానికి అప్పు తీసుకొని.. అవస్థల పాలవుతున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
ఇటీవలే హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో సునీల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొంపల్లికి చెందిన శ్రీకాంత్.. ఇన్స్టాంట్ లోన్ యాప్లో రూ.51,000 రుణం కోసం దరఖాస్తు చేసుకోగా.. అతనికి కేవలం రూ.35,667 మాత్రమే చెల్లించారు. వారంలోగా రుణం చెల్లించాలని షరతు విధించారు.
గడువులోగా రుణం చెల్లించకపోవడం వల్ల సదరు యాప్ నిర్వహకులు వేధింపులు ప్రారంభించారు. అతని ఫోన్లోని నంబర్లన్నింటితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. అందులో శ్రీకాంత్ ఫోటో పెట్టి ఫ్రాడ్, చోర్ అంటూ షేర్ చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బాధితుడికి ఫోన్లు చేయడం ప్రారంభించారు.
గంటకు సుమారు 20 నుంచి 30 సార్లు ఫోన్ చేస్తున్నారు. 15 నిమిషాల్లోనే రుణం చెల్లించాలని గడువు విధించారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. గడువులోగా రుణం చెల్లించలేకపోయాను. రెండు రోజులకే ఆరు వేల అదనపు రుసుం వేశారు. వేధింపులపై పోలీసులను ఆశ్రయించినా.. సరైన సమాధానం రాలేదు.
- శ్రీకాంత్, బాధితుడు
ఇవీచూడండి: ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ యాప్ రుణాలు