మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్ల మోసాల తీరు కూడా రోజురోజుకు మారుతూ వస్తోంది. వాట్సాప్ వేదికగా సరికొత్త తరహాలో మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించేందుకు నేరగాళ్లు వాట్సాప్‌కాల్, సందేశాలను వినియోగించుకుంటున్నారు. బాధితుల్ని సులభంగా మోసగించడమే కాకుండా... పోలీసుల దర్యాప్తును దారి మళ్ళించడానికి మోసగాళ్లు ఇలా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
వాట్సప్‌తో వంచిస్తున్నారు...
వాట్సప్ యాప్‌ను నిక్షిప్తం చేసుకునే సమయంలో ఎక్కడో విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల నంబరును నమోదు చేస్తున్నారు. ఆ నంబరుకు వచ్చే కోడ్‌ను ఇక్కడి సెల్ఫోన్లో నమోదు చేసి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అనంతరం ఆ సెల్‌ఫోన్ నుంచి పంపే సందేశాలు, వాట్సాప్ కాలింగ్ విదేశీ నంబరుతోనే వచ్చినట్లు నమ్మించగలుగుతున్నారు. తప్పుడు నంబర్లతో బాధితుల్ని బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు డబ్బుల్ని వేయించుకునేది మాత్రం ఇక్కడి ఖాతాల్లోనే కావడం గమనార్హం.
గిఫ్ట్‌ల పేరుతో గాలం...
సైబర్ నేరగాళ్లు వివాహ వెబ్ సైట్లను సైతం వదలడం లేదు. వధువు, వరుడు కావాలంటూ తమ పేర్లను నమోదు చేసే వాళ్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ముందుగా వివాహ వెబ్సైట్లలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అదే వెబ్సైట్లలో ఉండే ఇతరులను పెళ్లి పేరుతో నమ్మిస్తున్నారు. ప్రముఖ వైద్యుడిగానో... సాఫ్ట్వేర్ ఉద్యోగిగానో... విదేశాల్లో ఉంటున్నానని నమ్మించి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. నిశ్చితార్థం చేసుకుందామని నమ్మించి బుట్టలో వేసుకొని కాస్త నగదు సాయం చేయమని ధీనంగా అడుగుతున్నారు. వ్యాపారంలో పెట్టుబడి పేరుతో క్రమంగా నగదు వసూలు చేసి ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారు. కాబోయే శ్రీమతికి ఖరీదైన బహుమతి పంపానంటూ నమ్మిస్తారు. బహుమతి సొంతం చేసుకోవడానికి కొన్ని ముందస్తు చెల్లింపులు చేయాలని నమ్మించి విడతల వారీగా లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలు అనేకం.
ఇల్లు అమ్మి మరీ...
కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ హస్మత్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరస్థులు ఐదేళ్లపాటు మోసం చేస్తూ వచ్చారు. రేసు గుర్రాల శక్తిని పెంచే ఔషధాల విక్రయ వ్యాపారాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని... భాగస్వామిగా ఉండాలని నమ్మించాడు. బాధితుడి నుంచి విడతల వారీగా రూ.70లక్షలకు పైగా వసూలు చేశాడు. ఇనుప పెట్టెలో లక్ష అమెరికా డాలర్లు పంపించామని... దిల్లీ ఎయిర్ పోర్టులో ఐటీ అధికారులు పట్టుకున్నారని.... పన్ను చెల్లిస్తేనే డబ్బులు విడుదల చేస్తారని నమ్మించి అందినకాడికి దోచుకున్నాడు. బాధితుడు ఇళ్లు అమ్మి మరీ గుల్ల చేసుకున్నాడు. చివరికి మోసపోయానని గమనించి సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయిస్తే.. దర్యాప్తు చేసిన పోలీసులు ఓ ఆఫ్రికన్... ఈ మోసం చేసినట్లు తేల్చారు.
అప్రమత్తతే ఆయుధం...
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అప్రమత్తతే ప్రధాన ఆయుధమని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన బహుమతి వచ్చిందనగానే... ఆశపడకుండా ఆలోచించాలంటున్నారు. కస్టమ్స్ ఛార్జీలు కట్టాలనగానే... ఆతృత చెందకుండా ఎలాంటి వస్తువులకు వర్తిస్తాయో... అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి కాల్స్, సందేశాలు వస్తే... ఆచీతూచి స్పందించాలని హెచ్చరిస్తున్నారు.