రాయదుర్గం పీఎస్ పరిధి బీఎన్ఆర్ కాలనీలోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన చోరీలో... పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దొంగతనానికి పాల్పడిన నేపాల్ ముఠాను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి... అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఐదుగురు కలిసి చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు... దుండగులకు ఎవరెవరూ సహకరించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ అనే వ్యక్తి నేపాల్‌కు చెందిన నలుగురు వ్యక్తులను... మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనికి కుదిర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం లోకేశ్ కూడా పరారీలోనే ఉన్నాడు.
ఇంట్లోని డీవీఆర్‌ను ముఠా సభ్యులు ఎత్తుకెళ్లడంతో, నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఆ ఇంటి చుట్టుపక్కల పెద్దగా ఇళ్లు లేకపోవటం వల్ల సీసీ కెమెరాలు కూడా ఎక్కువగా లేవు. నిందితులు సైతం చోరీ చేసిన తర్వాత సీసీ కెమెరాల కంట పడకుండా గుట్టవైపు ప్రాంతం నుంచి పారిపోయారు. చోరీ చేసినప్పటి నుంచి పారిపోయే వరకు ముఠా సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
బృందాలుగా ఏర్పడిన పోలీసులు, ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం ద్వారా కొంత సమాచారం సేకరించిన పోలీసులు.... దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.