మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ నెల 10న జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూమి అమ్మకం విషయంలో తలెత్తిన విబేధాలే హత్యకు దారితీసినట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన మున్నూరు నర్సింహులు, కొడిగంటి యాదయ్య, కోసిగి మహేశ్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సరకు రవాణా వాహనం, ద్విచక్రవాహనం, మూడు సెల్ ఫోన్లు, వేటకత్తి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశారు.
పొలం అమ్మిన డబ్బులో వాటా ఇవ్వలేదని..
నిందితుల తాత ఆకుల భీమయ్యకు పద్మమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, యాదమ్మ నలుగురు కూతుళ్లు. పద్మమ్మ కుమారుడు యాదయ్య, లక్షమ్మ కుమారుడు మహేష్, యాదమ్మకు మున్నూరు నర్సింహులు, కొడిగంటి యాదయ్య ఇద్దరు కుమారులు. అంజమ్మకు పిల్లలు లేరు. ఆకుల భీమయ్యకు మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం గొల్లపల్లిలో 2 ఎకరాల 20 గుంటల భూమి ఉండేది. అది చాకలి పెంటయ్య అనే వ్యక్తి ఆధీనంలో ఉండగా తమభూమి తమకు అప్పగించాలని కోరుతూ భీమయ్య మనుమడైన యాదయ్య మహబూబ్ నగర్ ఆర్డీఓ వద్ద సివిల్ కేసు నమోదు చేశారు. కేసులో చివరకు చాకలి పెంటయ్య నుంచి ఎకరా 4 గుంటల భూమి యాదయ్యకు వచ్చింది. ఆ భూమిని 80 లక్షలకు విక్రయించిన యాదయ్య షాద్‌నగర్ ఇల్లు కొనుగోలు చేసి ఇటీవలే గృహప్రవేశం చేశారు. తాము కూడా ఆకుల భీమయ్య మనుమళ్లమని, తమకూ వాటా వస్తుందని ముగ్గురు నిందితులు యాదయ్యను డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేశానని చెప్పిన యాదయ్య వాటా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వాటా కోసం అడిగి విసిగిపోయిన నిందితులు చివరకు యాదయ్యని చంపాలని నిర్ణయించుకున్నారు. - జి.శ్రీధర్, మహబూబ్‌నగర్ డీఎస్పీ
వాహనంతో ఢీకొట్టి చంపితే కేసు ఉండదని..
వాహనంతో ఢీకొట్టి చంపితే కేసు ఉండదని భావించిన ముగ్గురు నిందితులు పాత మహీంద్ర సరకు రవాణా వాహనాన్ని కొనుగోలు చేశారు. ప్రణాళిక ప్రకారం ఓ వేటకొడవలి వెంట తెచ్చుకున్నారు. ఈనెల పదో తేదీన యాదయ్య, అతని భార్య శైలజ, కూతురు నిహారిక నవాబుపేట మండలం కారుకొండకు స్కూటీపై ఓ శుభకార్యానికి వెళ్లారు. యాదయ్యను చంపేందుకు ఇదే సరైన సమయమని భావించిన నర్సింహులు ఇంటికి తిరిగి వెళ్తున్న వారి కుటుంబాన్ని వాహనంతో వెంబడించారు. మిగిలిన ఇద్దరు బజాజ్ పల్సర్‌పై వెనకాలే అనుసరించారు. పక్కా ప్రణాళికతో గుండేడు గ్రామం వద్దకు రాగానే స్కూటీని వెనకవైపు నుంచి బొలెరో వాహనంతో బలంగా ఢీకొట్టాడు. కింద పడిపోయిన యాదయ్య భార్య శైలజపైకి రెండుసార్లు ఆటో ఎక్కించారు. ఘటనలో శైలజ చనిపోగా... యాదయ్య అతని కూతురు నిహారిక గాయాలతో బయట పడ్డారు.- జి.శ్రీధర్, మహబూబ్‌నగర్ డీఎస్పీ