కళ్లెదుటే తమకు కావాల్సిన వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతుంటే ఆ కుటుంబీకుల వేదన వర్ణించలేనిది. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన సురేష్.. తన నాలుగేళ్ల కుమారుని పుట్టినరోజు సందర్భంగా గుమ్మడవెల్లి వద్దనున్న పెద్ద వాగు వద్దకు విహారానికి వచ్చారు.
సురేష్‌తో పాటు భార్యాపిల్లలు, చెల్లెలు, బావమరిది పెదవాగు వద్దకు వెళ్లారు. వారంతా స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. అందరు చూస్తుండగానే వాగులో నీటి ప్రవాహానికి సురేష్ కొట్టుకుపోయాడు. గ్రామస్థులు గాలించి సురేష్‌ను బయటకు తీయగా.. అప్పటికే అతను మరణించాడు. అతని మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.