విద్యుత్ నియంత్రిక తగిలి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. తాను పనిచేసిన వ్యక్తి దగ్గర డబ్బులు అడిగేందుకు పెంటయ్య అనే వ్యక్తి వెళ్లాడు. సదురు యజమాని పక్కనే ఉన్న రాళ్లను తీసివేయాలని పురమాయించాడు. రాళ్లు తీసే నేపథ్యంలో విద్యుత్ నియంత్రిక తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
డబ్బులు అడిగేందుకు వస్తే పని చేయించుకోవటం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు యజమానితో వాగ్వాదానికి దిగారు. తమకు డబ్బులతో పాటు పరిహారం కూడా ఇప్పించాలని లేదంటే దుకాణం ముందే గోతి తీసి పాతి పెడతామని గుంతను తవ్వబోయారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.