ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ప్రమాదాలను మరువక ముందే విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని రామ్ కీ కంపెనీకి చెందిన విశాఖ సాల్వెంట్స్ సంస్థలో రియాక్టర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కన్ను పొడుచుకున్నా కానరానివిధంగా దట్టమైన పొగతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడున్న పరిశ్రమల్లోని ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలరచేతపట్టుకుని పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దాదాపు 50 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న మంటలు.. మరోవైపు హైటెన్షన్ విద్యుత్తు వైరు తెగి పడిపోవటంతో అసలేం జరుగుతోందో తెలియక జనంలో ఆందోళన పెరిగిపోయింది.
ఆకాశాన్ని తాకేంతగా అగ్నికీలలు ఎగిసిపడటంతో... ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకూ అగ్నిమాపక సిబ్బందికి వీలుకాలేదు. ఎట్టకేలకు శ్రమించి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. మొత్తం మూడు రియాక్టర్లలో ఒకటి పేలి మంటలు వ్యాపించగా... మిగిలిన రెండు ట్యాంకుల్లోని సాల్వెంట్ అగ్నికి ఆహుతైంది. మిథనాల్ సాల్వెంట్‌ను ఆ ట్యాంకుల్లో స్టోర్ చేసి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
కారణమేమిటో....
ప్రమాదం జరగడానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు తలెత్తినట్లు పేర్కొంటున్నారు. ఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన వారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీవో కిశోర్‌బాబు, ఏసీపీ రామాంజనేయులురెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వచ్చి కారణాలను ఆరా తీస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి కాలుష్య కారక వాయువులు ఏమి విడుదలయ్యాయన్న అంశంపై పరిశీలిస్తున్నారు.
వారంతా సురక్షితమేనా?
విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో ప్రమాదం సంభవించిన సమయానికి రెండో షిఫ్ట్‌లో దాదాపు 15 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగగానే ఒకరు మినహా మిగిలినవారందరూ సురక్షితంగా బయటకు వచ్చేసినట్టు చెబుతున్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ అగ్నికీలలు