హైదరాబాద్ మాదాపూర్లోని భాగ్యనగర్ వెల్ఫేర్ సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడానికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కూల్చివేతలను అడ్డుకుని కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. అనంతరం వారిని కారులో తీసుకెళ్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట వదిలి పారిపోయారు.
విషయం తెలుసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసి.. జేసీబీలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానిపై కేసు నమోదు చేశారు.