కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 36 తులాల బంగారం, రెండు తుపాకులు, 12 చరవాణిలు, రెండు ఖరీదైన చేతిగడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మురదాబాద్కు చెందిన ఫహీమ్, ముర్సలీంకు 2013లో జైల్లో పరిచయం ఏర్పడింది. బయటికి వచ్చిన తర్వాత చోరీలు చేయడం మొదలు పెట్టినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలు చేయడంలో ఈ ముఠా ఆరితేరిందని తెలిపారు. మురదాబాద్ నుంచి హైదరాబాద్కు కారులో వచ్చి శివారు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేసినట్లు వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్తో పాటు అమీన్పూర్, అల్వాల్, మేడ్చల్ ఠాణాల పరిధిలో ఈ ముఠా చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. గోవా, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీలోనూ ఫహీం ముఠా చోరీలకు పాల్పడినట్లు వివరించారు. ఫహీంపై మురదాబాద్లో హత్య, దోపిడీ, అపహరణ కేసులు కూడా ఉన్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.