అమెరికా జార్జియాలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన మహ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. పదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న మొహియుద్దీన్.. మిత్రుల భాగస్వామ్యంతో జార్జియాలో కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. కొన్నిరోజులుగా వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. రోజులాగే దుకాణానికి వెళ్లిన ఆయనని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హతమార్చారు. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటానని చివరగా భార్యకు ఫోన్ చేయగా... అనంతరం ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో ఆందోళనతో స్నేహితులను సంప్రదించగా అసలు విషయం తెలిసింది.
మొహియుద్దీన్ మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 10నెలల క్రితం మొహియుద్దీన్... హైదరాబాద్‌కు వచ్చారని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను అత్యవసర వీసా ద్వారా జార్జియా పంపే ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్‌కి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఉదయపు నడకకు వెళ్లి నాలాలో పడి వృద్ధురాలి మృతి