రుణ యాప్‌ల కేసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ చైనా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. దిల్లీ విమానాశ్రయంలో జువీ అలియాస్ లాంబో అనే చైనా దేశస్థుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇతను అగ్లో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, లీ యూ ఫాంగ్ టెక్నాలజీ, నాబ్లూమ్ టెక్నాలజీ, పిన్ ప్రింట్ టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లాంబోతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజును కూడా అరెస్ట్ చేశారు.
రూ.21 వేల కోట్లు రుణం
లాంబోకి సంబంధించిన కాల్ సెంటర్ల నిర్వహణలో నాగరాజుది కీలకపాత్రని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.4 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. రుణ గ్రహీతలకు రూ.21 వేల కోట్ల నగదు రుణంగా ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. బిట్ కాయిన్‌ల రూపంలో విదేశాలకు నగదు బదిలీ చేశారన్నారు. గత ఆరు నెలల్లోనే అధిక మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వివరించారు.
ఇప్పటివరకు 13 మంది అరెస్ట్
చైనాకు చెందిన యువాన్ అలియాస్ సిస్సీ అలియాస్ జెనిఫర్.. ఇండియాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నట్లుగా తెలిపారు. ఇతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాపుల్లో డ్రాగన్ వ్యక్తులదే కీలక పాత్ర...