పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం గంగమ్మగుడి వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను తప్పించబోయి అదుపు తప్పిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రహదారి పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులు బురదలో చిక్కుకుని ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. బస్సు ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.