మెదక్ జిల్లా కొల్చారానికి చెందిన ఉప సర్పంచ్ నింగోల చెన్నయ్యకు ఒక్కగానొక్క కూతురు నవనీత. ఇదే గ్రామానికి చెందిన ఆశన్న గారి ప్రశాంత్‌ను చదువుకునే సమయం నుంచి ప్రేమించింది. వారి ప్రేమను చూసి పెద్దలు సైతం ఎమనలేకపోయారు. ఇటీవలే ఇద్దరు మేజర్లు కాగానే... అందరి సమక్షంలో వివాహం చేశారు. పెళ్లి అయిన కొన్నాళ్లకే వారి మధ్య మరో అమ్మాయి ప్రవేశించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త... మరో అమ్మాయి పట్ల చనువుగా ఉండటం చూసి నవనీత తట్టుకోలేకపోయింది. తనకే సొంతమనుకున్న భర్త... ఇంకో అమ్మాయితో ప్రేమగా ఉంటున్నాడన్న మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడింది.
విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.