గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయితో పాటు ఒక లారీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీలో ఎండు గంజాయిని తరలిస్తున్న నలుగురిని కేయూ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన పవార్ గణపతి ప్రధాన నిందితుడని పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. గతంలో పవార్ గణపతిపై 8 కేసులు ఉన్నాయని... మరో నిందితుడు వినయ్ కుమార్‌పై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. డబ్బును సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని సీపీ వ్యాఖ్యానించారు.
డ్రైవర్ హకీం పరారీలో ఉన్నారని వెల్లడించారు. త్వరలో హకీంను అదుపులోకి తీసుకుంటామని తెలిపిన ఆయన... పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులను అభినందించారు.
ఇదీ చదవండి: మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం