సైబర్ దొంగలు ప్రస్తుతం అత్యవసర పరిస్థితులనూ సొమ్ము చేసుకుంటున్నారు. స్నేహితుడినంటూ తప్పుడు ఈ మెయిల్ పంపించి మోసగిస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. తుకారం గేట్‌కు చెందిన చంద్రశేఖర్‌కు తన స్నేహితుడి ఫొటో డీపీతో ఉన్న వాట్సాప్ అకౌంట్ ద్వారా జూన్ 25న మెసేజ్ వచ్చింది.
అందులో 'ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను. అనారోగ్యంతో నా భార్యను ఆసుపత్రిలో చేర్పించారట... శస్త్ర చికిత్స చేయకపోతే బతకదని చెబుతున్నారు. సుమారు మూడు, నాలుగు లక్షలు అవుతుందట... నువ్వు సర్దితే రాగానే తిరిగి ఇచ్చేస్తా' అని ఉంది. ఇప్పటికప్పుడే అంత డబ్బు కష్టమని సమాధానమిస్తూ తన దగ్గరున్న 1.45 లక్షలు వాట్సాప్ సందేశంలో ఉన్న ఖాతాకు పంపించాడు.
ఇటీవల ఆయన స్నేహితుడిని కలిసినప్పుడు అసలు విషయం బయటపడింది. మోసపోయినట్లు తెలుసుకుని బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.