కోటీ 12లక్షల రూపాయల లంచం కేసులో అదనపు కలెక్టర్ నగేశ్ బినామీలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నించారు. నగేశ్‌కు జీవన్ గౌడ్‌తో పాటు మరో ముగ్గురు బినామీలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురిని కూడా కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. వీళ్ల పేర్ల మీద ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే విషయాన్ని అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే జీవన్ గౌడ్ పేరు మీద 5 ఎకరాల భూమిని ఒప్పందం చేయించినట్లు అనిశా అధికారులు తేల్చారు.
ఎలా పరిచయమయ్యారు
నగేశ్ ఆర్డీఓగా పనిచేసిన సమయంలో జీవన్ గౌడ్‌తో ఏర్పడిన పరిచయం బినామీగా మారే వరకు వచ్చినట్లు గుర్తించారు. మిగతా ముగ్గురు బినామీలు ఎలా పరిచయమయ్యారు. ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే కోణంలో అనిశా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్ పల్లిలోని ఆంధ్రాబ్యాంకులో నగేశ్‌కు చెందిన లాకర్‌ను తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.
ఇంకా ఏమైనా ఎన్ఓసీలు ఇచ్చారా
లాకర్ తాళంచెవికి సంబంధించి నగేశ్ సమాధానం చెప్పకపోవడంతో... బ్యాంకు అధికారుల సాయంతో లాకర్‌ను తెరిచేందుకు అనిశా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్ కలిసి నర్సాపూర్ తరహాలో ఇతర భూములకు ఏమైనా ఎన్ఓసీలు ఇచ్చారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి : రూ.40 లక్షలు ఎక్కడ దాచారనే విషయంపై అనిశా ఆరా