నకిలీ బంగారం కుదువ పెట్టి లోన్ తీసుకొని బ్యాంకులను మోసగించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పహడీ షరీఫ్ పీఎస్ పరిధి తుక్కుగూడలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2 కోట్ల 91 లక్షల విలువ చేసే నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకొని మోసం చేసిన కేసులో అప్పటి బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్, డిప్యూటీ మేనేజర్ ప్రదీప్ కుమార్, సాయినాథ్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీది.. అసలుగా
ఇందులో ప్రధాన నిందితుడైన సాయినాథ్ బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేసేవాడు. అతని బంధువులు సంతోశ్ కుమార్, శివనాథ్‌తో కలిసి నకిలీ బంగారాన్ని చెక్ చేయించి అసలైన బంగారంగా నిర్ధరణ చేయించేవాడు. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సాయినాథ్ ఇంటి దస్తావేజులు, కారు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వెలుగులోకి వచ్చిందిలా...
తుక్కుగూడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ యశ్వంత్ రెడ్డికి బ్యాంక్ లో గోల్డ్ లోన్స్ పై అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానం వచ్చి బయట నుంచి మరో అప్రైజర్ ను తీసుకొచ్చాడు. బ్యాంక్ లోని బంగారాన్ని తనిఖీ చేయించగా... 96 లోన్లలో ఉన్న బంగారం నకిలీ అని తేలింది. ఈ నెల 23న పహడీ షరీఫ్ పోలీసులు మేనేజర్ ఫిర్యాదు చేశారు.
ప్రధాన నిందితుడు సాయినాథ్, మంఖాల్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా అప్రైజర్ గా పనిచేసే సంతోశ్ కుమార్, శివనాథ్ల సహాయంతో అక్కడి బ్యాంక్ మేనేజర్, సిబ్బందికి తెలియకుండా ఏడుగురు పేర్ల మీద రూ. 54లక్షల 6వేల లోన్లు తీసుకొని మోసగించారని పోలీసులు తెలిపారు.