హైదరాబాద్‌లో నకిలీ వైద్యుడిగా చలామణీ అవుతున్న వైఎస్ తేజ అలియాస్ తేజారెడ్డి అలియాస్ అవినాష్‌రెడ్డి అలియాస్ వీరగంధం తేజ(23), ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), వైఎస్ తేజ తండ్రి వీరగంధం వెంకటరావు(41)ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ..
వైఎస్ తేజ తొలుత బెంగళూరులోని సప్తగిరి ఆసుపత్రిలో జూనియర్ డీఎంవోగా చేరాడు. ఆ సమయంలోనే ఐపీఎస్ అధికారిగా అవతారమెత్తాడు. ఏఎస్పీ దేవనగిరి అంటూ కొన్ని పోలీస్ స్టేషన్లు తనిఖీ చేశాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంఎన్ రెడ్డి కుమారుడినంటూ కూడా పరిచయం చేసుకుని తప్పుదోవ పట్టించాడు. దీంతో అక్కడ కేసు నమోదయ్యింది. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాం మార్చాడు. నగరంలోని అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడిగా పనిచేశాడు. 2020 ఫిబ్రవరి వరకు వైద్యశిబిరాలు నిర్వహించాడు. లాక్‌డౌన్ మొదలైన తర్వాత క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను అందజేశాడు. రాచకొండ కొవిడ్ కంట్రోల్‌రూంలో వలంటీర్‌గా చేరాడు. కరోనా బారిన పడిన సిబ్బందికి వైద్యం చేశాడు.
ఎలా అనుమానం వచ్చిందంటే..
ఆసుపత్రుల్లో పనిచేసేటప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పరిచయం పెంచుకునేవాడు. ఏపీ సీఎం జగన్‌కు చుట్టమంటూ ఎంతో మందికి టోపీ పెట్టాడు. రూ.15 లక్షల రుణం ఎగ్గొట్టాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురి చేయడంతో ఆమె కేసు పెట్టింది. ఆ సమయంలో రౌడీ షీటర్ చెందిన వాహనానికి ప్రభుత్వం వాహనం అని స్టిక్కర్ వేయించుకుని తిరిగాడు. పోలీసులకు అనుమానమొచ్చి ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది.