బోరు పడితే ఆ రైతు తన కష్టాలు తీరుతాయనుకున్నాడు. అప్పు చేసి మరీ భూతల్లిని నీటి కోసం దోసిలి పట్టి అర్దించాడు. అయినా ఆ భూమాత కరగలేదు. చివరికి బోరు వేయడం కోసం చేసిన అప్పు తీరే మార్గం లేక.. సొంత భూమిలోనే ప్రాణాన్ని వదిలాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొమ్మాట చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమిలో గత ఏడాది అప్పులు చేసి 3 బోర్లు వేశాడు. ఒక్క బోరులో కూడా నీరు పడలేదు.
నీళ్లైతే పడలేదు.. కాని దానికోసం చేసిన అప్పు మాత్రం అలాగే మిగిలింది. చివరికి అప్పులు తీర్చే మార్గంలేక చంద్రయ్య మనస్థాపం చెందాడు. మంగళశారం రాత్రి పురుగుల మందు తాగి.. అన్ని రోజులు నీడనిచ్చిన తన పొలంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అలా ఈ రైతు భగీరథ ప్రయత్నం చేసి ఓడిపోయాడు. చివరికి ప్రాణాలనే వదులుకున్నాడు. మృతుని భార్య జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి: స్నేహితులే హత్య చేశారు.. మూడు రోజుల్లో హత్యకేసు ఛేదన!