తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీలు చేసే చోరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్ చదివాడు..
మహబూబ్ నగర్ జిల్లా అవులోని బాయి గ్రామానికి చెందిన కిరణ్ ఇంటర్ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్లో నివాసం ఏర్పరుచుకున్నాడు ఆవుల కిరణ్ అలియాస్ రాహుల్. విలాసాలకు అలవాటు పడి మొదట చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ తర్వాత సులభంగా డబ్బు వస్తుండటంతో పెద్ద పెద్ద చోరీలు మొదలుపెట్టాడు.
3 కమిషనరేట్‌ల్లోనూ కేసులు
ఇలా నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు ఖమ్మంలోనూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో సహా పలు ప్రాంతాల్లో 90 చోరీల్లో ఇతను నేరస్థుడు. కిరణ్ కోసం రెండు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సమయంలో ఏప్రిల్‌లో ఖమ్మం పోలీసులకు చిక్కాడు. అనంతరం జూలైలో జైలు నుంచి విడుదలై తిరిగి నగరంలో దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కిరణ్‌పై ప్రత్యేక నిఘా పెట్టగా పోలీసుల వలకు చిక్కాడు.
నల్లటి హెల్మెట్‌తో రెక్కీ..
మొదట తాను చోరీ చేయాల్సిన ఇళ్లను ఎంచుకుని..ఆపై పగలు రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తాడు. నెంబర్ లేని ద్విచక్ర వాహనంపై సీసీటీవీ కెమెరాల్లో కూడా కనిపించకుండా నల్లటి హెల్మెట్‌తో రెక్కి చేస్తాడని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంచుకున్న అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ఇళ్ళను గుర్తు పెట్టుకుని రాత్రి చోరీ చేసి అక్కడ్నుంచి పరార్ అవుతాడని సీపీ వివరించారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే చోరీ చేయడంలో కిరణ్ సిద్ధహస్తుడని సజ్జనార్ వెల్లడించారు. దోచుకున్న ఆభారణాలను నగల దుకాణంలో అమ్మి.. వచ్చిన డబ్బుతో విమానాల్లో గోవా లాంటి ప్రదాశాలకు వెళ్లి జల్సా చేస్తాడని స్పష్టం చేశారు.
డబ్బు అయిపోతే మళ్లీ షురువు..
డబ్బు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి చోరీలను కొనసాగిస్తాడని సీపీ అన్నారు. నిందితుడి నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో 60 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. నిందితుడు ఆవుల కిరణ్‌ను సీసీటీవీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు సజ్జనార్ తెలిపారు.
ఆ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..
మరో కేసులో మారుమూల గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటక గుల్బర్గాకి చెందిన షేక్ సాబేర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగగా మారాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో నిద్రించే వారి నుంచి బంగారం, పర్సుల చోరీలు ప్రారంభించాడు. ఓ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. జైలులో ఇతనికి పఠాన్ చాంద్ పాషాతో పరిచయం ఏర్పడింది. పఠాన్ విడుదల అయిన తర్వాత సాబేర్‌ను కూడా విడిపించాడు.
సాబేర్ 15, పఠాన్ 10 కేసుల్లో రికార్డుల్లోకి
అనంతరం ఇరువురు కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో రెక్కి నిర్వహించి చోరీలు చేయడం ఆరంభించారు. సాబేర్ 15 కేసుల్లో నిందితుడు కాగా, పఠాన్ 10 కేసుల్లో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా చోరీలకు పాల్పడతారు. సాబేర్ పథకం వేసి పఠాన్‌కి పని అప్పగిస్తాడు. పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. దోచుకుకున్న సొత్తును సాబేర్ అమ్మి ఆ డబ్బును ఇద్దరూ పంచుకుంటారు.
ప్రత్యేక నిఘాతో అదపులోకి..
నగరంలోనూ పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వారి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సైబరాబాద్ క్యాట్ (సెంట్రలైజ్డ్ ఎనలైజ్ టీమ్) సహకారంతో నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి 325 గ్రాముల బంగారం, కిలో వెండి, 6లక్షల 70వేల రూపాయలు, ఒక ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.
ఊరెళ్లే ముందు సమాచారమివ్వండి..
ఇళ్ళకు తాళం వేసి వెళ్ళేటపుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. గృహాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.