తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోసూరు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన వాహనాలను గుర్తించి వాళ్లు ఏపీ, కర్ణాటక, తెలంగాణ వైపు పారిపోయే అవకాశం ఉందని అనుమానించారు. ఈ మేరకు నిందితుల ఫొటోలు, వారు ఉపయోగించిన వాహనాలకు సంబంధించిన వివరాలను ఏపీ, తెలంగాణ పోలీసులకు అందజేశారు.
జాతీయ రహదారి మీదుగా నిందితులు వచ్చే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జాతీయ రహదారి వద్ద దోపిడీ దొంగల వాహనం కనిపించింది. వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వాహనాలను తనిఖీలు చేపట్టగా అందులో బంగారంతో పాటు ఆయుధాలు లభించాయి. తమిళనాడు పోలీసులు పంపిన దృశ్యాలతో సైబరాబాద్ పోలీసులు నిందితుల ఫొటోలు ఆధారంగా దోపిడీకి పాల్పడింది వారేనని నిర్ధరించుకున్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి : చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు