ఇతర యాప్‌లతో మోసాలపై పోలీసులు ప్రజలను హెచ్చరిస్తుండడం వల్ల సైబర్ నేరస్థులు ఫేస్‌బుక్ ఖాతాల్లోని మార్కెట్ ప్లేస్‌లో సైన్యాధికారుల్లా తమను పరిచయం చేసుకుంటున్నారు. ఆ ప్రకటనలను చూసి ఆసక్తి ప్రదర్శించిన వారితో స్నేహంగా మాట్లాడి టాక్స్ కట్టాలని, రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ రూ.వేలల్లో నగదు స్వాహా చేస్తున్నారు.
బంజారాహిల్స్‌లో నివాసముంటున్న ఒక యువకుడికి రూ.15వేలకే ఐఫోన్ ఇస్తామంటూ చెప్పి అతడి వద్ద రూ.9వేలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఫోన్ ఎప్పుడు పంపిస్తారని అడిగితే.. రూ.25వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హీరో హోండా బైక్ రూ.25 వేలకే ఇస్తామంటూ అమీర్‌పేటలో ఉంటున్న విద్యార్థికి చెప్పి రూ.35 వేలు నగదు జమ చేయించుకున్నారు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు.
లాక్‌డౌన్ సమయమే అదునుగా...
లాక్‌డౌన్ సమయాన్ని సైబర్ నేరస్థులు అదునుగా చేసుకుంటున్నారు. బాధితులందరూ దాదాపుగా ఇళ్లల్లో ఉంటున్నారని తెలుసుకుంటున్న వీరు బ్యాంక్ అధికారుల్లా ఫోన్లు చేస్తూ ఓటీపీలు చెప్పించుకుని నగదు బదిలీ చేయించుకుంటున్నారు.
క్విక్ సపోర్ట్ యాప్ ద్వారా వేగంగా లావాదేవీలు కొనసాగించేందుకు వీలుంటుందని నమ్మించి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. తర్వాత బాధితుల ఖాతాల్లోంచి వారే నగదు స్వాహా చేస్తున్నారు. టోలీచౌకీలో నివాసముంటున్న ఒక యువతి తన పేటీఎం ఖాతాలో రూ.29 వేలను ఇతరుల ఖాతాలోకి బదిలీ చేసేందుకు ప్రయత్నించి విఫలమవడం వల్ల కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసింది. సైబర్ నేరస్థులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించి పేటీఎం ఖాతాతో పాటు మరో బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం రూ.79వేలను నగదు బదిలీ చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఫిర్యాదులు తగ్గిపోతాయని భావిస్తే ఇందుకు భిన్నంగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.