యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బిక్షపతి రావును రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పరామర్శించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని బాలాజీనగర్‌లో సీఐ గాయపడిన ఘటన బాధకరమన్నారు. బిక్షపతి రావుకు 40 నుంచి 50 శాతం వరకు కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బాలాజీనగర్ సర్వేనంబర్ 423 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు ఉన్న విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో అక్కడే గదిలో ఉంటున్న శాంతి కుమారి, పూనమ్ చందు.. ఇంటిని కూల్చి వేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అదే సమయంలో వారు ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఇంటి గడప వద్ద పోసి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించిన సీఐ వారిని కాపాడే క్రమంలో ఇంట్లోకి వెళ్లిటంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఆయన చేయి, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ చెప్పారు.
ఇదీ చదవండి: ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండండి: కిషన్ రెడ్డి