జీహెచ్ఎంసీతోపాటు పలు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ మూడులోని ఎక్సోర సంస్థలో గంగాధర్ ఆపరేషనల్ మేనేజర్‌గా, మహేందర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ జీహెచ్ఎంసీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రచారం ప్రారంభించారు. దానికి అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. సంస్థ తరపున ఐడీకార్డులు ఇచ్చారు.
కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారు. ఇలా 450 మంది నుంచి రూ.కోటి వరకు కొల్లగొట్టారని బ్యాంకు లావాదేవీల ద్వారా పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో పలువురు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : నడిరోడ్డుపై తగలబడిన కారు.. వీడియో ఇదిగో..!