జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి తిమింగలాలు బయటపడ్డాయి. ఓ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఉప కమిషనర్ సుధారాణి, అదే విభాగం పూర్వ పర్యవేక్షకుడు శ్రీనివాసగాంధీ నిందితులు అరెస్టు కాకుండా ఉండేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేయడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఇన్‌ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్, అనుబంధ సంస్థలు భరణి కమొడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్, భరణి కమొడిటీస్, హైదరాబాద్ స్టీల్స్‌కు సంబంధించి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను అక్రమంగా పొందేందుకు ప్రయత్నించారనే ఫిర్యాదుపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్‌లో గతంలో కేసు నమోదైంది.
రూ.5 కోట్ల లంచం డిమాండ్
ఈ కేసులో సంస్థ డైరెక్టర్ జగన్నగారి సత్య శ్రీధర్‌రెడ్డిని 2019 మార్చి 6న అరెస్ట్ చేశారు. అదే నెల 29న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఉప కమిషనర్ సుధారాణి, అదే విభాగం పూర్వ పర్యవేక్షకుడు శ్రీనివాసగాంధీ నిందితుడితో కుమ్మక్కయ్యారు. హైదరాబాద్ స్టీల్స్‌లో భాగస్వామిగా ఉన్న నిందితుడి భార్య రాఘవిరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండటంతోపాటు కేసులో నిందితుడికి సహకరించేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారు.
స్థలం ఇవ్వాలంటూ నిందితుడిపై ఒత్తిడి
ఇందులో భాగంగా అదే ఏడాది ఏప్రిల్ 15న నిందితుడి నుంచి రూ.10లక్షలు నగదు తీసుకున్నారు. మిగిలిన లంచం డబ్బు ఇవ్వడంలో జాప్యం జరగడంతో ఖాళీస్థలం ఇవ్వాలంటూ నిందితుడిపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై గతంలోనే సీబీఐకి ఫిర్యాదు అందడంతో ప్రాథమిక విచారణ చేపట్టింది. నేరానికి సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి: రూ. 88 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు