తప్పుడు పత్రాలతో రుణం పొందేందుకు వచ్చిన వారికి ఉద్దేశపూర్వకంగా రూ.1.80 కోట్లు మంజూరు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నతాధికారి ఆర్.ఎస్. మహాపాత్రను, బ్యాంకు న్యాయ సలహాదారు నర్సింగ్ రావును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.ఎస్. మహాపాత్ర... ఎనిమిదేళ్ల క్రితం ఖైరతాబాద్‌లో పని చేశారు.
ఆ సమయంలో నిరంజన్, కృష్ణ, సతీశ్ కొల్లూరు, లక్ష్మీనారాయణ, ప్రభాకర్.. తమకు రుణం కావాలంటూ మహాపాత్రను సంప్రదించారు. వారు సమర్పించిన తప్పుడు పత్రాల ఆధారంగా రూ.1.80 కోట్లు రుణంగా మంజూరు చేశారు. ఆ తర్వాత నిరంజన్, సతీశ్... ఒక్క కిస్తీ కూడా చెల్లించలేదు. బ్యాంకు ఉన్నతాధికారులు పరిశీలించగా... అవి తప్పుడు పత్రాలని తేలింది. దీనిపై ఆరు నెలల కిందట సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్దిరోజుల క్రితం నలుగురు నిందితులను జైలుకు పంపారు. తాజాగా మహాపాత్ర, నర్సింగ్ రావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.