మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లచ్చిరామ్ తండాకు చెందిన బొడ నానుకూభాయి ప్రసూతి కోసం నిన్న మధ్యాహ్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. రాత్రి 8 గంటలకు సిజేరియన్ చేయగా పాపకు జన్మనిచ్చింది. రాత్రి 12:30 నిమిషాల సమయంలో వాంతులు చేసుకోవడం, శరీరం చల్లబడగా ఐసీయూకు తరలించారు.
చికిత్స పొందుతూ మృతి..
అయినా ఫలితం లేకపోయేసరికి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మరోసారి ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స సమయంలో బాలింత శరీరం నుంచి రక్తస్రావం ఆగకపోయే సరికి ఆమె మృతి చెందింది. ఆగ్రహించిన బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని.. ఆపరేషన్ థియేటర్‌లోనే వైద్యులపై దాడికి దిగారు. అడ్డుకున్న సెక్యూరిటీపై కూడా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని.. మృతురాలి కుటుంబ సభ్యుల్ని శాంతింపజేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇంటికి పంపించారు.
విధులను బహిష్కరించిన వైద్యులు..
దాడిని ఖండిస్తూ డాక్టర్లు, సిబ్బంది విధులను బహిష్కరించారు. బాధితులపై చర్యలు తీసుకొని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణ చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నరేశ్‌కుమార్ తెలిపారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించే సరికి రోగులు ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి: ప్రత్యేక నిఘా: మావోయిస్టుల్లో తెలంగాణ వారెందరో తెలుసా?