గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురై కన్ను మూశారు. ఈనెల 19న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా రెండ్రోజులు బాగానే ఉందని, ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈనెల 21న తెల్లవారు జాము నుంచి తీవ్రమైన చలి, జ్వరం రావడం వల్ల ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయలక్ష్మి చనిపోయారు.
విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన జిల్లా కలెక్టర్ శామ్యూ్ల్‌తో ఆశా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10వేల మందికి టీకా వేశామని, ఎవరికీ ఎలాంటి సమస్య తలెత్తలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. శవపరీక్ష నివేదిక అనంతరం విజయలక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయని అన్నారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడి కలెక్టర్, అధికారులు వెనుదిరిగారు. కలెక్టర్ తీరును నిరసిస్తూ ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇవీచూడండి: తెలంగాణలో మరో 197 కరోనా కేసులు, ఒకరు మృతి