ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. రేపు మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ లోపు ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొదట పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు... దాటవేత ధోరణ అవలంబించిన అఖిలప్రియ.. ఆ తర్వాత కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
చర్చలకు నిరాకరించడం వల్ల!
తాను మాజీ మంత్రినని... రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తుంటాయని... అఖిల ప్రియ పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అపహరణ కేసులో సేకరించిన సాంకేతిక ఆధారాలను ఆమె ముందుంచడంతో... కొన్నింటిని ఒప్పుకున్నట్లు సమాచారం. హఫీజ్ పేటలోని 25ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్ రావు సోదరులతో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ... వాళ్లు నిరాకరించినట్లు పోలీసుల వద్ద అఖిల ప్రియ తెలిపినట్లు సమాచారం.
వారికోసం ప్రత్యేక బృందాలు
చివరికి భూమిని రాయించుకునేందుకు అఖిలప్రియ దంపతులు కలిసి అపహరించారని పోలీసులు కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగద్విఖ్యాత్ రెడ్డితో పాటు మిగతా నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వీళ్లను అదుపులోకి తీసుకుంటే అపహరణ కేసులో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు అరెస్టు