యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మలరామరం మండలం మేడిపల్లికి చెందిన కసాబోణి నర్సింహ, బాలలక్ష్మి, వారి మనుమడు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రాంపూర్ వద్ద రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల బ్రేక్ వేయగానే బైక్పై నుంచి మహిళ జారి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో బాలలక్ష్మి నుజ్జు నుజ్జు అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమె భర్త నర్సింహ, వారి మనువడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పక్క గ్రామం రుస్తాపూర్లో లారీ డ్రైవర్ తన వాహనాన్ని నిలిపి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: విద్యుత్స్తంభంపై షాట్సర్క్యూట్... దుకాణానికి మంటలవ్యాప్తి