మద్యానికి బానిసైన వ్యక్తి బహిరంగ ప్రదేశంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన చల్ల ఐలయ్య(35) మద్యానికి బానిసై... ఇంట్లో రోజూ గొడవపడే వాడు. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు మందలించినా వినేవాడు కాదు.
బుధవారం రోజు ఉదయం 10 గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తానని చెప్పిన ఐలయ్య మళ్లీ రాలేదు. గురువారం ఉదయం సుమారు ఆరున్నర సమయంలో స్థానికుడు బహిర్భూమి కోసం వెళ్లగా... చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా.. అప్పటికే మరణించినట్లు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. ఐలయ్య భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.