మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఈ నెల 15న అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి అథియాన్ ఘటన విషాదాంతమైంది. ఆడుకోవడానికి బయటికి వెళ్లిన బాలుడు... సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు 11 రోజుల తర్వాత శామీర్‌పేట బాహ్యవలయ రహదారి పక్కన అథియాన్ మృతదేహాన్ని గుర్తించారు. బాలుడు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బిహార్ వాసి సుదర్శన్ శర్మ హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.
భవనంపైనుంచి కిందపడి..
బిహార్‌కు చెందిన 17 ఏళ్ల సుదర్శన్ శర్మ నెలరోజులుగా అథియాన్ ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. ఈనెల 15న షేర్‌చాట్ వీడియోలు చిత్రీకరించేందుకు సుదర్శన్ శర్మ.. అథియాన్‌ను పిలిచాడు. వీడియో తీసే క్రమంలో బాలుడు భవనంపైనుంచి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. అథియాన్ తల్లిదండ్రులు కొడతారని భయపడ్డ సుదర్శన్.. బాలుడ్ని హత్యచేసి సంచిలో పెట్టుకుని... బాహ్యవలయ రహదారి వద్ద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇస్తే బాలుడ్ని వదిలేస్తామని బెదిరించాడు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు నిందితున్ని గుర్తించారు. సుదర్శన్ ఇచ్చిన సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన పోలీసులకు... బాలుడి అస్థికలు, దుస్తులు కనిపించాయి.
ఘటనాస్థలిలో అథియాన్ అస్థికలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తల్లిదండ్రులకు అప్పగించారు. అందులోని కొన్ని ఎముకలను డీఎన్ఏ పరీక్షకు పంపినట్లు తెలిపారు.
సంబంధిత కథనాలు: షేర్‌చాట్‌లో వీడియో తీస్తుండగా ప్రమాదం... చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు