Electric Cars Year Ender 2024 Story: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో వీటిని వాడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూయెల్ ధరలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు.
మన దేశంలో కూడా ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ ఏడాది కార్ల తయారీ సంస్థలు అనేక విద్యుత్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిలో 400 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుకుందాం రండి.
1. Mahindra XEV 9e:
ఈ కారును స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా ఇటీవలే నవంబర్ నెలలో విడుదల చేసింది. ఇది 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. దీని బిగ్ బ్యాటరీ ప్యాక్ 656 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఇక చిన్న బ్యాటరీ ప్యాక్ ఈ కారుకు 542 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. వీటితో పాటు మహింద్రా.. ఈ కొత్త 'XEV 9e'లో మరెన్నో అదిరే ఫీచర్లను కూడా అందించింది. కంపెనీ ఈ కారును రూ.21.90 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది.
2. Mahindra BE 6e:
'XEV 9e'తో పాటు మహింద్రా ఈ ఎలక్ట్రిక్ 'BE 6e' పేరుతో ఈ SUVని కూడా మార్కెట్లో విడుదల చేసింది. అయితే తర్వాత కంపెనీ ఈ కారు పేరులో 'e' ని తొలగించి 'BE 6'గా మార్పుచేసింది. కంపెనీ దీన్ని కేవలం 59kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే విడుదల చేసింది. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు.. ఈ కారును 556 కి.మీ రేంజ్ వరకు నడపొచ్చు. మహింద్రా ఈ కొత్త 'BE 6' కారును రూ. 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది. ఈ సరసమైన ధరతో పాటు కంపెనీ ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను కూడా అందించింది.
3. Tata Curvv EV:
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ SUV కూపేని ఆగస్టు 2024లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ 'కర్వ్ ఈవీ' కారులో 45kWh, 55kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తోంది. దీని 45kWh బ్యాటరీ 502 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇక 55kWh బ్యాటరీ ప్యాక్ 585 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. టాటా ఈ కారును రూ. 17.49 - 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విక్రయిస్తోంది.
4. Tata Punch EV:
కంపెనీ జనవరి 2024లో భారతీయ మార్కెట్లో 'టాటా పంచ్ EV'ని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ SUVని రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విక్రయిస్తోంది. కంపెనీ దీన్ని.. 25kWh, 35kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో విక్రయిస్తోంది. దీని చిన్న బ్యాటరీ కారుకు 315 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇక దీని పెద్ద బ్యాటరీ 421 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.
5. Kia EV9 GT-Line:
కొరియన్ కార్ల తయారీ సంస్థ ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ SUVని అక్టోబర్ 2024లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ 99.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ SUVని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు 561 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని ARAI సర్టిఫై చేసింది. దీనిలోని మోటార్ పవర్ అవుట్‌పుట్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఇది 379bhp పవర్, 700nm టార్క్‌ను అందిస్తుంది. కంపెనీ ఈ కారును రూ. 1.30 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది.
6. Mercedes-Benz EQS:
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తన ఎలక్ట్రిక్ సెడాన్ 'EQS'ని సెప్టెంబర్ 2024లో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఈ సెడాన్‌ను రూ. 1.62 కోట్ల ధరతో (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తోంది. ఈ సెడాన్‌లో AWD కోసం రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇది 107.8 kWh బ్యాటరీ ప్యాక్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కారు టాప్ రేంజ్ 857 కిలోమీటర్లు. దీని ఎలక్ట్రిక్ మోటార్ 516bhp పవర్, 855nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
7. Volvo EX40:
వోల్వో కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV 'XC40 రీఛార్జ్'ను అక్టోబర్ 2024లో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. అయితే కంపెనీ తాజాగా దీని పేరును 'EX40'గా మార్చింది. ఈ కారు ధర రూ.56.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 69kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 475 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ SUV RWD కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. దాని వెనక భాగంలో ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. ఇది 238bhp పవర్, 420nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
8. BMW i5:
లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన ఎలక్ట్రిక్ సెడాన్ 'BMW i5'ని ఏప్రిల్ 2024లో భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ కారు కేవలం 'i5 M60 xDrive' అనే ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 83.9 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ గరిష్టంగా 516 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ కారు AWD సెటప్‌తో వస్తుంది. దీని ఫ్రంట్, బ్యాక్ యాక్సెల్పై ఒక్కొక్క మోటారు ఉంటుంది. ఇవి 601bhp, 795nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారును రూ.1.20 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది.
9. MINI Countryman Electric:
MINI కంపెనీ తన 'మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్'ని జూలై 2024లో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇది చిన్న హ్యాచ్‌బ్యాక్. అయినప్పటికీ ఈ కారులో పవర్‌కి మాత్రం ఏమాత్రం కొదువలేదు. కంపెనీ దీనిని FWD సెటప్‌తో కేవలం 'కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ E' అనే వేరియంట్‌లో మాత్రమే విక్రయిస్తోంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 201bhp శక్తి, 250nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు 66.45 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 462 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర రూ. 54.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
10. BYD eMax 7:
చైనాకి చెందిన కార్ల తయారీ సంస్థ BYD తన అనేక ఎలక్ట్రిక్ ఉత్పత్తులను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. అక్టోబర్ 2024లో కంపెనీ తన 'BYD eMAX 7' కారును ఇండియాలో ప్రారంభించింది. దీన్ని 55.4 kWh, 71.8 kWh రెండు బ్యాటరీ ఆప్షన్లతో తీసుకొచ్చింది. దీని చిన్న బ్యాటరీ 420 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. అయితే దాని పెద్ద బ్యాటరీ గరిష్టంగా 530 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. BYD ఈ కారును భారతీయ మార్కెట్లో రూ. 26.90 లక్షల నుంచి రూ. 29.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది.
మార్కెట్లో ఈవీ స్కూటర్ల జోరు- ఏడాదిలో 10 లక్షల యూనిట్ల సేల్స్- టాప్ మోడల్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!
ఎటు చూసినా ఏఐ- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనూ హవా- ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మోడల్స్ ఇవే!
6000mAh బ్యాటరీ ప్యాక్‌తో 5G ఫోన్- నీటిలో పడినా ఏం కాదంట.. ధర కూడా రూ.15వేల లోపే!