Man Committed Frauds in Name Of Marriage in Hyderabad : ఒక్కగానొక్క కుమార్తె ఉన్నత విద్య పూర్తి చేసింది. మ్యాట్రిమోనీ ద్వారా ఒక యువకుడి ప్రొఫైల్ నచ్చడంతో పెళ్లి చేయాలని అనుకున్నారు. పెళ్లి చూపుల తంతు ముగియగానే ఆ అబ్బాయి గొంతెమ్మ కోరికల జాబితా విని ఆశ్చర్యపోయారు. కాబోయే అల్లుడు కదా అని సరే అనుకున్నారు. కొద్దిరోజులకే నగలు, వివాహ ఖర్చులంటూ రూ.25 లక్షలు తీసుకున్నాడు. తాను కొంటున్న ఆభరణాలను వాట్సాప్‌లోనూ పంపించాడు. అయితే పెళ్లి పనుల్లో నిమగ్నమైన వధువు ఇంటి వారికి ఊహించని షాక్ తగిలింది.
మాయమాటలతో బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ : అప్పటికే అతడికి పెళ్లై పలుమార్లు జైలుకి వెళ్లొచ్చిన్నట్లు తెలిసింది. పెళ్లి రద్దు చేసి డబ్బు తిరిగివ్వమంటే ఇవ్వలేదు. నలదీస్తే చెక్కులు ఇచ్చాడు. అవీ చెల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. నిందితుడు ఎంతోమంది యువతులను మాయ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఏం చదివాడో ఎవరికీ తెలియదు కానీ మాయమాటలతో బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు ఇతడి ఆగడాలకు కళ్లె వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల చిట్టాను వెలికి తీస్తున్నారు.
కి'లేడీ' వివాహాలు.. ఆరుగురిని మనువాడిన మహిళ.. ఏడోసారి పెళ్లి పీటలు ఎక్కుతూ..
పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు : నిందితుడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. గచ్చిబౌలి, బంజారాహిల్స్, మియాపూర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ఉంటాడు. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఇతడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో సామాజిక వర్గాలకు తగ్గట్టుగా పేరు మార్చుకుంటాడు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నట్లు నమ్మించేందుకు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్టు చేసేవాడు.
విగ్గులూ మార్చుతూ : ముఖ్యంగా ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకునేవాడు. అలా వైద్యవిద్య పూర్తి చేసిన ఒక యువతిని పెళ్లి ఖర్చుల పేరిట రూ.20 లక్షలకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్‌కు చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ నిర్వాహకుడినంటూ భారీగా డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన వయసు తెలియకుండా రకరకాల విగ్గులతో ఏమార్చుతాడు. అని పోలీసుల విచారణలో తేలింది.