మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 రోజుల శిశువు చనిపోయాడు. గాయాలైన కన్నతల్లి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన సార మురళి, అంజలికి వివాహమై మూడేళ్ల అనంతరం మగ శిశువు జన్మించాడు.
మురళి అన్నదమ్ములైన మరో ముగ్గురికి మొత్తం నలుగురు ఆడ పిల్లలున్నారు. కుటుంబంలో మగ పిల్లవాడు కావాలని ఇన్నాళ్లు ఎదురుచూశారు. రెండు రోజుల్లో తొట్టెల శుభకార్యం చేయాలని బంధువులను ఆహ్వానించి ఏర్పాట్లు చేసుకున్నారు. నవజాత శిశువుకు విరేచనాలు కావడంతో వైద్యం చేయించేందుకు తూప్రాన్ పట్టణానికి ద్విచక్ర వాహనంపై మురళి, అంజలి, అన్న కూతురు అరుణజ్యోతి వస్తున్నారు. నాగులపల్లి కూడలి వద్ద జాతీయ రహదారి కూడలి విస్తరణ పనులు జరుగుతున్నందున ఇస్లాంపూర్ శివారులో యూటర్న్ తీసుకున్నారు.
మలుపు తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు, ఆ వెంటనే వస్తున్న ఓ కారు వరుసగా ఢీకొన్నాయి. శిశువు సహా ద్విచక్ర వాహనంపై ఉన్న మరో ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లికి ఇటీవలే ప్రసవానికి శస్త్రచికిత్స జరిగింది. ఆమెకు తల, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు, ఢీకొన్న వాహనదారు గాయాల పాలయ్యారు. 108 వాహనంలో మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాఖీలు కట్టించుకోవా పండూ..
‘ఇంట్లో ఒక మనవడు కావాలని బాలమ్మకు మొక్కిన పండూ.. నీకు తొట్టెల చేసి.. పేరు పెట్టి.. అక్కలతో రాఖీ కట్టిద్దామనుకుంటిమి.. కట్టించుకోవా పండూ.. నీ అమ్మకు ఏమని చెప్పాలిరా..’ అంటూ మృత శిశువును హత్తుకుంటూ నానమ్మ బుచ్చమ్మ రోదించిన తీరు ఆసుపత్రిలో అందరినీ కంటతడి పెట్టించింది. తీవ్రగాయాలతో ఉన్న అంజలికి తన కొడుకు మృతి చెందాడనే విషయం తెలియలేదు. తెలిస్తే తల్లి పరిస్థితి ఏంటనేది బంధువులకు అంతుపట్టకుండా ఉంది.