ఉత్తర ఇరాక్‌లోని అన్బర్ రాష్ట్రంలో అమెరికా - ఇరాక్ వైమానిక స్థావరంపై బుధవారం దాడి జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.20 గంటలకు అయిన్ అల్ అసద్ ఎయిర్ బేస్‌లో పది క్షిపణులతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు ఇరాక్ సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, క్షిపణులను ప్రయోగించిన ప్రదేశాన్ని గుర్తించామని పేర్కొంది.
ప్రతీకార చర్య?
అమెరికాపై ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ దాడి చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా.. మిలిటెంట్లకు ఇరాన్ సహకారం అందిస్తోందని ఆరోపిస్తూ ఇరాక్ - సిరియా సరిహద్దులో వైమానిక దాడికి పాల్పడింది. ఆ దాడి తర్వాత అమెరికాపై ఇదే తొలిదాడి కావడం గమనార్హం. గతేడాదిలా ఇరు దేశాల మధ్య పరస్పర ప్రతీకార చర్యలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో రెండు రోజుల్లో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఇరాక్ పర్యటన జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి : రష్యా అధికారులపై అమెరికా, ఈయూ ఆంక్షలు