కరోనా నివారణకు చైనా సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన టీకా 86 శాతం సమర్థంగా పనిచేస్తోందని యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రకటించింది. సినోఫార్మ్ సీఎన్‌బీజీ టీకా ఫేజ్ 3 మధ్యంతర ఫలితాలను పూర్తిగా విశ్లేషించినట్లు యూఏఈ వైద్య శాఖ తెలిపింది. టీకా వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తలేదని వెల్లడించింది.
అయితే యూఏఈ చేసిన ప్రకటన అసంపూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. యూఏఈలో జరిగిన ట్రయల్స్‌లో పాల్గొన్నవారి సమాచారాన్నే విశ్లేషించారా లేదా... చైనా, ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రయోగాలను పరిగణనలోకి తీసుకున్నారా అనే వివరాలను వైద్యశాఖ పొందుపరచలేదు. టీకా సురక్షితంగానే ఉందని ప్రకటించినప్పటికీ.. ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయా అనే విషయాలు వెల్లడించలేదు. టీకా.. అధికారిక రిజిస్ట్రేషన్ పొందిందని నివేదికలో చెప్పినప్పటికీ.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో స్పష్టం చేయలేదు. ఈ విషయంపై సినోఫార్మ్, ఎమిరేట్స్ అధికారులు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఈ టీకాను దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ సహా యూఏఈకి చెందిన ఉన్నతాధికారులు బహిరంగంగా స్వీకరించారు.
పూర్తిగా అన్‌లాక్
మరోవైపు, రెండు వారాల్లో అన్ని ఆర్థిక, పర్యటక, సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు అబుదాబి ప్రకటించింది. కరోనా పోరులో విజయం సాధించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.