Turkish Man Isolation: టర్కీకి చెందిన ఓ వ్యక్తి గత 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే గడుపుతున్నాడు. 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు 78సార్లు కరోనా టెస్టు చేయగా.. అన్నిసార్లూ పాజిటివ్ ఫలితం రావడమే ఇందుకు కారణం.
త్వరగానే కోలుకున్నా..
ముజఫర్ కయాసన్(56) టర్కీ ఇస్తాంబుల్ వాసి. 2020 నవంబర్‌లో తొలిసారి కరోనా సోకింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కొద్దిరోజులకే కోలుకున్నాడు. లక్షణాలేవీ లేవు. కానీ టెస్టు చేస్తే మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. చేసేదేం లేక మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాడు.
తర్వాత ఎన్నిసార్లు పరీక్షించినా ఫలితంలో మార్పు లేదు. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ అనే వస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జయి ఇంట్లోనే స్వీయ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు ముజఫర్. మంచి ఆహారం తీసుకుంటూ తగిన ఔషధాలు వాడుతున్నాడు. అయినా ఫలితం మారలేదు. ఇప్పటివరకు 78 సార్లు పరీక్షించినా.. కొవిడ్ పాజిటివ్ అనే వచ్చింది.
14 నెలలుగా ఐసోలేషన్‌లో ఉంటూ ప్రత్యక్ష నరకం చూస్తున్నాడు ముజఫర్. అతడి సామాజిక జీవితం పూర్తిగా దెబ్బతింది. పిల్లలు, మనమళ్లను అద్దంలో నుంచే చూస్తున్నాడు. బంధువులు, స్నేహితులతో మాట్లాడే పరిస్థితి లేదు. ఫలితంగా.. అంతకంతకూ మానసికంగా కుంగిపోతున్నాడా బాధితుడు.
నెగెటివ్ రాదు.. టీకా ఇవ్వలేరు..
ముజఫర్ లుకేమియా రోగి. అతడి రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. అంటే.. కరోనా వంటి వైరస్‌లపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేదు. అందుకే అతడికి కరోనా నెగెటివ్ రావడం లేదు. ఆరోగ్యం అసలే బాగాలేదు కాబట్టి.. వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఎంతకాలం ఉండాలో తెలియక ముజఫర్ దిగులు చెందుతున్నాడు. తమ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా చేయాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
ఇవీ చూడండి: పెన్షన్ కోసం లింగ మార్పిడి- వృద్ధుడి ప్లాన్ తెలిసి అధికారుల మైండ్ బ్లాంక్!
ఆరేళ్లుగా మొసలి మెడలో బైక్ టైర్- ఆ యువకుడి ప్లాన్‌తో విముక్తి