ఇటీవల ఇరాన్లో జరిగిన ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై అనుమానాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ భద్రతా దళాలు పొరపాటున ఆ విమానాన్ని కూల్చేసి ఉంటాయని అమెరికా మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే ట్రంప్ ఇలా స్పందించారు.
"ప్రమాదంపై నాకు అనుమానాలున్నాయి" అని ట్రంప్ అన్నారు
.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయారు.
తోసిపుచ్చిన ఇరాన్..
ఉక్రెయిన్ విమానం కూలేందుకు ఇరాన్ క్షిపణులే కారణమంటూ వచ్చిన వార్తలను ఆ దేశం తోసిపుచ్చింది. ఆ వాదనలు అర్థం లేనివని కొట్టిపారేశారు ఇరాన్ అధికారులు.
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడులు జరిపిన కొద్ది సేపటికే.. ఉక్రెయిన్ విమానం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షిపణులే ఇందుకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వచ్చాయి.
ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇరాన్ గగనతలంలో అదే ఎత్తు (8,000 అడుగులు)లో పలు అంతర్జాతీయ, జాతీయ విమానాలు ఎగురుతున్నట్లు ఆ దేశం వెల్లడించింది. ప్రమాదంపై ఉక్రెయిన్ ప్రభుత్వంతో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఇరాన్ అధికారులు.
అయితే ఈ వ్యవహారంపై కెనడా, బ్రిటన్ దేశాలు ఇరాన్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన ఇరాన్, అమెరికా.. అయినా ప్రమాదం అంచునే!