ముంబయిలో దొరికే ఫేమస్ వడపావ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఇది మన దేశానికే పరిమితం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. వడపావ్ ఇప్పుడు దుబాయ్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ అవుతోంది. గోల్డ్ బిర్యానీ, గోల్డెన్ బర్గర్ మాదిరే ఇప్పడు గోల్డ్ వడపావ్‌నూ అర్డర్ చేయొచ్చు.
దుబాయ్‌లోని కరమా ప్రాంతంలో ఉన్న ఓపావో అనే రెస్టారెంట్ భారతీయుల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేస్తుంటుంది. తాజాగా '22కే గోల్డెన్ పావ్' పేరుతో ఈ ఆహార పదార్థాన్ని ప్రవేశపెట్టింది. దీని ధరను 99 దిర్హామ్ (సుమారు రూ. 2,000)గా ప్రకటించింది.
ఎలా చేస్తారంటే..?
వెన్న, జున్నుతో తయారు చేసిన ఈ వడపావ్‌పై 22 కారెట్ల బంగారంతో తయారు చేసిన తినదగిన రేకును దీనిపై ఉంచుతారు. మస్రత్ దావూద్ అనే పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో గోల్డ్ వడపావ్ వీడియోను షేర్ చేశారు. దీన్ని 20వేలకు పైగా మంది వీక్షించారు. ఫుడ్ లవర్స్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఒక గోల్డ్ ప్లేటెడ్ చెక్క పెట్టెలో నుంచి వడపావ్‌ను తీస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీనికి ఇంత ధరనా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలోనూ రూ. 19,704 లతో 'రాయల్ గోల్డ్ బిర్యానీ' పేరుతో లగ్జరీ డిన్నర్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. దీనిలో గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో మూడు రకాల వంటకాలను వడ్డించేవారు.
ఇదీ చదవండి: అదేపనిగా 'టై' ధరిస్తున్నారా?.. అయితే జాగ్రత్త!