డిసెంబర్ 3న ఖాసిం సులేమానీపై దాడి కోసం అమెరికా అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసింది. భద్రతా కారణాల రీత్యా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రక్షణ రంగ నిపుణుల విశ్లేషణలు దాడి జరిగిన తీరుకు చాలా దగ్గరగా ఉన్నాయి.
ఇరాన్ ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ అధినేత ఖాసిం సులేమానీకి చుట్టుపక్కల దేశాల్లో మంచి పరపతి ఉంది. ఒక రకంగా అక్కడి ప్రభుత్వాలు ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. ఈ క్రమంలో సులేమానీ ఇరాక్, లెబనాన్, సిరియాల్లో స్వేచ్ఛగా పర్యటిస్తుంటారు. తనను ‘ఎవరూ టచ్ చేయలేరు’ అనే భావన ఆయనలో బలంగా ఉంది. ఇది భద్రతాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపడానికి కారణం అయింది. ఎంతగా అంటే.. ఒక సారి ఇరాక్‌లోని వైమానిక స్థావరంలో సులేమానీ జెట్ తన విమానానికి కొంచె దూరంలోనే ల్యాండ్ అయిందని ఒక అమెరికా మాజీ కమాండర్ చెప్పారు. కానీ, అప్పట్లో అమెరికా అతడిని లక్ష్యంగా చేసుకోలేదు.
ఆద్యంతం రహస్యంగా..
అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి వెనుక సులేమానీ హస్తం ఉందని భావించిన అమెరికా అతడిని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకొంది. అప్పటికే అతడి కదలికలపై అమెరికా, ఇజ్రాయిల్, సౌదీలు కొన్నేళ్లుగా నిఘా పెట్టాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. పెంటగాన్ అత్యంత నమ్మకమైన వేగులు అందించిన సమాచారం, ఎలక్ట్రానిక్ తరంగాలను విశ్లేషించి, నిఘా విమానాలు అందించిన సమాచారం, ఇతర గూఢచర్య తంత్రాలను వాడి సులేమానీ బాగ్దాద్‌కు వస్తున్నట్లు ధ్రువీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు చేరవేశారు. ఆయన ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన దీనిని పూర్తిగా రహస్యంగా ఉంచారు.
చివరికి తన ఆప్తమిత్ర దేశమైన బ్రిటన్, పశ్చిమ దేశాలకు కూడా తెలియజేయలేదు. ఈ విషయంలో ఆయన్ను డెమొక్రాట్లు తప్పుపట్టారు కూడా. అమెరికా ప్రమాదంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా ఇంటెలిజెన్స్ ఆధారంగా సులేమానీ రాకను నిర్ధారించుకొన్నామని చెప్పారు.
రంగంలోకి సైలెంట్ ‘కిల్లర్’..
ఈ ఆపరేషన్ కోసం అమెరికా డ్రోన్లను రంగంలోకి దింపింది. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు ‘హంటర్ కిల్లర్ల’ను బయటకు తీసింది (ఇటువంటివి ఈ దాడిలో రెండు నుంచి మూడు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంఖ్యపై స్పష్టత లేదు). ఈ డ్రోన్లు గంటకు 480 కిలోమీటర్ల వేగంతో దాదాపు 1800 కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించగలవు. ఇవి పెద్దగా ధ్వనిని సృష్టించవు. ఒక్కో డ్రోన్‌ను కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇద్దరు నడిపిస్తుంటారు. ఇవి సమీపంలోకి వచ్చే వరకూ ఎవరూ పసిగట్టలేరు. దాడి జరిగిన ప్రదేశంలో అమెరికాకు చెందిన డ్రోన్ ఆపరేషనల్ బేస్‌లు ఏమీ లేవు. దీంతో 570 కిలోమీటర్ల దూరంలోని కువైట్‌లోని అలీ అల్ సలీం బేస్ లేదా, ఖతార్, యూఏఈల్లోని వైమానిక స్థావరాల నుంచి వీటిని తరలించి ఉండొచ్చు. వీటికి 17.2 కిలోల బరువున్న లేజర్ గైడెడ్ హెల్‌ఫైర్ నింజా క్షిపణులను అమర్చింది. ఇవి ఒక యుద్ధట్యాంక్‌ను కూడా తునాతునకలు చేయగలవు. ఈ క్షిపణి వార్‌హెడ్‌కు బ్లేడ్స్ ఉంటాయి. ఇవి కచ్చితంగా లక్ష్యం మీదనే దాడి జరిగేలా చేస్తాయి. చుటుపక్కల జరిగే నష్టాన్ని బాగా తగ్గిస్తాయి. అంటే అమెరికాకు సులేమానీ కచ్చితంగా ఎక్కడ కూర్చున్నాడో కూడా తెలిసి ఉంటుంది. అదీ అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ బలం. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు జాయింట్ స్ట్రైక్ ఫోర్స్ నిర్వహించింది.
సిరియా నుంచి రాగానే..
మరోపక్క శుక్రవారం తెల్లవారుజామున సులేమానీ మరికొందరు ముఖ్యులతో కలిసి బాగ్దాద్ విమానాశ్రయంలో దిగారు. ఆయన సిరియా నుంచి వస్తుండగా.. ఆయన సహచరులు లెబనాన్ నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు(ఇది కచ్చితంగా తెలియరాలేదు). సులేమానీకి స్వాగతం పలకడానికి పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత అబు అల్ ముహందీస్ బృందం రెండు టయోటా ఎస్‌యూవీల్లో అప్పటికే విమానాశ్రయానికి చేరుకొంది. విమానం రాగానే.. సులేమానీ కిందకు దిగారు. ముహందీస్ ఆయనకు స్వాగతం పలికారు. వీరిద్దరు కలిసి ఒక ఎస్‌యూవీలో ఎక్కగా.. వీరి భద్రతా సిబ్బంది ముందు వాహనంలో ఎక్కారు. వీరి వాహనాల కోసం అప్పటికే నింగిలో అమెరికా దళాల డ్రోన్లు ఎదురు చూస్తున్నాయి.
వీరి వాహనాలు విమానాశ్రయ కార్గో ప్రాంతాన్ని దాటి రోడ్డుపైకి చేరుకొనే సమయంలో కొన్ని క్షిపణులు ఒక్కసారిగా వచ్చి మీదపడ్డాయి. సులేమానీ ఉన్న వాహనాన్ని రెండు, ముందు వాహనాన్ని ఒక క్షిపణి తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతం మొత్తం వాహనాల తునకలతో నిండిపోయింది. వేలి ఉంగరం ఆధారంగా సులేమానీని గుర్తించారు. హెల్‌ఫైర్ క్షిపణుల పేలుడు వేడికి కార్ల ఛాసీస్‌లు మెలి తిరిగిపోయాయి. భద్రతా సిబ్బంది తుపాకులు కరిగిపోయాయి. వెంటనే అక్కడి నుంచి డ్రోన్‌లు వెనుదిరిగాయి. కానీ, ఇరాన్ మాత్రం ఈ దాడిని హెలికాప్టర్లు నిర్వహించాయని చెబుతోంది.
ఇదీ చూడండి: 'ఇరాన్ చర్యలతో ప్రమాదంలోకి ఇరాక్'