చైనా తర్వాత కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 97 మంది ప్రాణాలు కోల్పోగా..మృతుల సంఖ్య 611కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య 12,729కి చేరుకుంది.
పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారు.
ఒక్క రోజులో 1,500 కొత్త కేసులు..
ఐరోపాలోని స్పెయిన్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 1,500 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 5,753కు చేరింది. యూరప్‌లో ఇటలీ తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా స్పెయిన్ నిలిచింది. ఆ దేశంలో ఇప్పటి వరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంది.
రువాండాలో భారతీయుడికి కరోనా..
ఆఫ్రికాలోని రువాండాలో ఇటీవలే తొలి కరోనా కేసు నమోదైంది. ఆ వ్యక్తి ఓ భారతీయుడని తాజాగా రువాండా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 8న ముంబయి నుంచి తమ దేశంలోకి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ప్రత్యేక శిబిరంలో వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇది రెండో కేసు(మొదటిది కెన్యాలో).
ఐరాసకూ వైరస్ సెగ..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని కోరింది ఐక్యరాజ్య సమితి. అత్యవసరమైతే తప్ప ఏప్రిల్ 12 వరకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలని సూచించింది.
సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, మెడికల్ డైరెక్టర్లు, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌లు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐరాస అధికార ప్రతినిధి ఓ ప్రకటన చేశారు.
ఇదీ చూడండి: లక్షణాలు తెలిసే లోపే వేగంగా కరోనా వ్యాప్తి