బీరుట్లో జరిగిన విధ్వంసకర పేలుడుకు లెబనాన్‌లో జనాభాలోని పదో వంతు మంది(దాదాపు 3 లక్షలు) నిరాశ్రయులయ్యారు. 130 మందికిపైగా మరణించారు. వేలాది మంది ఆసుపత్రుల వద్ద చికిత్స కోసం బారులు తీరారు. ఇప్పటికే కోవిడ్ వ్యాపించడంతో.. ఈ పేలుడు బాధితులకు పడకలు కరవైపోయాయి.
నౌక ఇంజిన్ చెడిపోకుంటే పరిస్థితి వేరు..
అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థం కావడంతో దాని రవాణాకు అనుమతులు.. పత్రాలు తప్పనిసరి. సైప్రస్‌లో నివసించే రష్యా వ్యాపారవేత్త ఆధీనంలోని ఎం.వి. రోహ్‌సస్ అనే నౌక జార్జియా నుంచి మోజాంబిక్‌కు బయల్దేరింది. మార్గమధ్యంలో బీరుట్ సమీపంలో నౌక ఇంజిన్ చెడిపోయింది. దీంతో బలవంతంగా దాన్ని బీరుట్ నౌకాశ్రయానికి చేర్చారు. అక్కడ పత్రాలు తనిఖీ చేయగా.. ఆ నౌకకు ప్రయాణార్హత లేదని, నిషేధం ఉన్నట్టు తేలింది. సిబ్బందిలో నలుగురు ఉక్రెయిన్‌కు, ఒకరు రష్యాకు చెందినవారు. వివిధ రకాల వివాదాల తర్వాత వారిని విడుదల చేశారు. కొన్నాళ్లకే నౌక యజమాని దివాలా తీయడంతో నౌకను అలానే బీరుట్ పోర్టులో ఉంచేశారు. నౌకపై న్యాయ వివాదాలు మొదలు కావడంతో అందులోనే ఏళ్లపాటు 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంచడం ప్రమాదకరమని భావించి దానిని పోర్టులోని హ్యాంగర్ 12లో భద్రపర్చారు. ఆ తర్వాత 2018లో అమ్మోనియం నైట్రేట్‌ను వదిలేసి షిప్ పోర్టు నుంచి అదృశ్యమైపోయింది.
పేలుడు పదార్థాలు అక్కడి నుంచే..!
ఈ నౌకలో పట్టుకొన్న అమ్మోనియం నైట్రేట్ బ్రెజిల్‌లోని ఆర్కాస్ నైట్రో ప్రిల్ సంస్థ చేసిన ‘నైట్రోప్రిల్ హెచ్‌డీ’ రకంగా భావిస్తున్నారు. ఈ గోదాము తెరిచినప్పటి పాత చిత్రాల్లో కనిపించిన సంచులపై ఈ కంపెనీ పేరు ఉంది. ఈ సంస్థ క్వారీల్లోకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ చేసే పేలుడు పదార్థం అత్యధికంగా 400 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వచేయాలని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అసలే ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని పేరున్న చోట 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఉంచడంపై అనేక సందేహాలు వస్తున్నాయి. మరోపక్క అంత భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకొంటే వచ్చే నగదు బహుమతికి ఆశపడి అధికారులు దానిని పోర్టులో నిల్వచేశారా..?అని లెబనాన్ జర్నలిస్టులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లెబనాన్ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, నిర్లక్ష్యం వెరసి లక్షలాది ప్రజల ప్రాణాలపైకి తీసుకొచ్చాయి.
అణు బాంబును తలపించిన పేలుడు
పేలుడు తీవ్రత అణుబాంబును తలపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ చప్పుడు 200 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్‌లో వినిపించిందంటేనే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 9 కిలోమీటర్ల దూరంలోని విమానాశ్రయ అద్దాలు పగిలిపోయాయి. భూకంప లేఖినిపై దీని తీవ్ర 3.3గా నమోదైంది. అంటే చిన్నపాటి భూకంపంతో సమానమన్న మాట. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబులో ఐదోవంతు శక్తికి సమానమని అంగ్ల పత్రిక 'ది సన్'’ పేర్కొంది. పేలుడు తర్వాత అణు విస్ఫోటంలా పొగలు సుడులు తిరుగుతూ మేఘాన్ని కమ్మేయడం కూడా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పేలుడు తీవ్రతకు ఈ ఓడరేవు వద్ద ఉన్న మూడు నౌకలు మునిగిపోయాయి.
భారీ ఆస్తినష్టం...
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశానికి పేలుడు ఘటన అశనిపాతంలా మారింది. ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం ఈ పేలుడు వల్ల నష్టం 15 బిలియన్ డాలర్లను దాటేసింది. దాదాపు పదేళ్ల నుంచి లెబనాన్‌కు భారీగా వలసలు వస్తున్నారు. పొరగునున్న సిరియాలో అంతర్యుద్ధం కారణంగా అక్కడి నుంచి పెద్దసంఖ్యలో లెబనాన్‌కు చేరుకొంటున్నారు. దీనికి తోడు లెబనాన్ వాసులే రోజువారీ ఆహారం కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి కొవిడ్ కూడా తోడు కావడంతో దేశంలో సంక్షోభం నెలకొంది. ఆహార ధరలు 247శాతం పెరిగినట్లు అంచనా. ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్న ఆహార గోదాములు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ గాయం నుంచి కోలుకోవడానికి బీరుట్‌కు కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు!