ఇరాన్ అధ్యక్షుడిగా ఆ దేశ న్యాయశాఖ అధిపతి ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల్లో రైసీకి 1.78 కోట్ల లభించాయి. ఆయన సమీప ప్రత్యర్థి రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మోహ్సెన్ రెజాయి 33 లక్షలు, అబ్దోల్ నాసీర్ హెమతి 24 లక్షల ఓట్లు దక్కించుకున్నట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ హెడ్ జమాల్ ఓర్ఫ్ వెల్లడించారు.
అయితే, అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఇరాన్ ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన రెజాయి, హెమతి తమ పరాజయాన్ని ఒప్పుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా రైసీకి హెమతి అభినందనలు తెలిపారు.
తనకు కఠిన ప్రత్యర్థిగా ఉన్న నేతను అనర్హుడిగా ప్రకటించిన తర్వాతే రైసీ పోటీలో మెరుగైన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. రైసీ ఎన్నికైతే.. బాధ్యతలు చేపట్టక ముందే అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న తొలి ఇరాన్ అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. 1988లో జరిగిన రాజకీయ ఖైదీల సామూహిక హత్యల్లో రైసీ ప్రమేయం ఉందని అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి: చైనా- ఇరాన్ ఒప్పందం- భారత విధానాలకు ముప్పు!