గత నెలలో 11 రోజులపాటు జరిగిన సంఘర్షణ ఆగిన తర్వాత.. ఇజ్రాయెల్ రెండోసారి గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైకి వరుసగా మూడోరోజూ అగ్నితో కూడిన బెలూన్లను ప్రయోగించారు. దీనికి ప్రతిగా.. గురువారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం గాజా ప్రాంతంపై వాయుదాడులు చేసింది.
బెలూన్ల దాడికి ప్రతిగా తమ ఫైటర్ జెట్లు హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, ఓ రాకెట్ లాంచ్ సైట్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే.. ఈ వైమానిక దాడుల్లో జరిగిన నష్టంపై ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.
ఈజిప్ట్ చొరవతో..
గతనెలలో పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య 11 రోజుల పాటు సంఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాకెట్ దాడులు చేసుకున్నాయి. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్-గాజాలు అంగీకరించాయి. అయితే.. ఈ ఒప్పందం జరిగి నెలరోజులు కూడా కాకముందే బుధవారం ఇరు వర్గాల మధ్య మళ్లీ యుద్ధ ఛాయలు కనిపించాయి. తమ భూభాగంలోకి పేలుడు బెలూన్లను వదిలారని ఆరోపించిన ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు చేసింది.
ఇదీ చూడండి: గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం
ఇదీ చూడండి: కొత్త ప్రభుత్వంతో ఇజ్రాయెల్ పునర్నిర్మాణం జరిగేనా?